బిగ్ షాట్స్ కు పరాభవం

ఆంధ్రప్రదేశ్ లో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలతో రాజకీయ ఫ్యామిలీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవుతోంది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాలు తమకెదురైన ఓటమితో షాకవుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అనంతపురంలో పొలిటికల్ ఫ్యామిలీలు పరాజయం పాలయ్యాయి. పరిటాల కుటుంబానికి కంచుకోటలా నిలిచిన రాప్తాడులో పరిటాల శ్రీరామ్ ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఇన్నాళ్లూ గెలవడం తప్ప మరో మాట తెలియని జేసీ ఫ్యామిలీ తొలిసారి ఓటమి రుచి చూస్తోంది. మొదటిసారే జేసీ వారసులిద్దరూ ఓడిపోతున్నారు. అనంతపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ లు ఘోర పరాజయం ముంగిట నిలిచారు.

రెండు దశాబ్దాలుగా వరుస విజయాలతో గెలుపు గుర్రంగా పేరొందిన మంత్రి దేవినేని ఉమ తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. కర్నూలు జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్న కేఈ ఫ్యామిలీ ఈ సారి ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యేలా ఉంది. పొన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఓటమి బాటలో పయనిస్తున్నారు. 1996 ఉప ఎన్నిక నుంచి ఇప్పటి వరకు ఓటమనేదే ఎరగని మంత్రి అమర్ నాథ్ రెడ్డి పరాజయ పథంలో ఉన్నారు. మరో మంత్రి ఘంటా శ్రీనివాసరావు కూడా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం నియోజక వర్గం మారినా ఆయనకు ఓటమి తప్పేలా లేదు.

ఇక వైసీపీ ప్రభంజనానికి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బాబాయ్-అబ్బాయ్ లు కూడా ఓటమి బాటలో సాగుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులకు ఈ ఎన్నికల్లో చుక్కెదురవుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం ఓటమి బాటలో ఉన్నారు. అధినేత దగ్గర పట్టుబట్టి సత్తెనపల్లి సీటు తెచ్చుకున్నా కోడెల ఎన్నికల్లో గెలిచి గట్టెక్కలేకపోతున్నారు.