గ్రీన్ కార్డ్ స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసా

ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డులను ‘బిల్డ్ అమెరికా’ వీసాలతో భర్తీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. తన కొత్త ప్రతిభ, పాయింట్స్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఆయన వివరించారు. కొత్త విధానంలో అత్యున్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచనున్నారు. అయితే ప్రతి ఏడాది కేటాయించే గ్రీన్ కార్డుల సంఖ్యను మాత్రం మార్చే యోచనలో వైట్ హౌస్ లేదు.

శ్వేత సౌధంలోని రోజ్ గార్డెన్ లో ట్రంప్ తన కొత్త ప్రతిపాదనను వివరిస్తూ ‘వలసదారులు రావాలని కోరుకుంటున్నాం. మా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకొనే వారికి తలుపులు తెరుస్తున్నాం. కానీ ఈ వలసదారుల్లో ఎక్కువ భాగం తమ ప్రతిభ, నైపుణ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది. ప్రపంచంలో మీరెక్కడ పుట్టారు? మీ బంధువులెవరు? అనేవి కాకుండా మీరు అమెరికా పౌరుడు కావాలంటే మేం కోరుకుంటున్న ప్రమాణాలను మీరు సాధించాలి. దీనివల్ల మా దేశంలో వలసల్లో వైవిధ్యం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ కేటగిరీలను కొత్త వీసాతో భర్తీ చేస్తాం. అది బిల్డ్ అమెరికా వీసా’ అని తెలిపారు.

ఏటా అమెరికా సుమారుగా 1.1 మిలియన్ల గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. గ్రీన్ కార్డులు ఉంటే ఇతర దేశాలకు చెందినవారు జీవిత కాలం పాటు అమెరికాలో నివసించేందుకు, ఉద్యోగం చేయవచ్చు. ఐదేళ్లలో పౌరసత్వం పొందే అవకాశం కూడా కలుగుతుంది. ప్రస్తుతం చాలా వరకు గ్రీన్ కార్డులు కుటుంబ సంబంధాలు, వైవిధ్యం వీసా ఆధారంగా జారీ చేస్తున్నారు. నిపుణులు, అత్యుత్తమ నైపుణ్యాలు కలవారికి చాలా తక్కువ కార్డులు ఇస్తున్నారు.