మసీదులు పెరిగిపోతున్నాయి, ఏమైనా చేయండి

మసీదులు పెరిగిపోతున్నాయి, ఏమైనా చేయండి

పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కి లేఖ రాశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల నుంచి రోడ్లను సైతం ఆక్రమిస్తూ మసీదులు పెరిగిపోతున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. మంగళవారం వర్మ ఎల్జీకి లేఖ రాస్తూ ఈ అంశంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు.

లెఫ్టినెంట్ గవర్నర్ కు రాసిన లేఖలో ఆయన ‘నేను యావత్ ఢిల్లీ, ముఖ్యంగా నా పార్లమెంటరీ నియోజకవర్గంలోని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, ఏకాంత ప్రదేశాలలో ఒక ప్రత్యేకమైన తరహాలో మసీదులు వేగంగా పెరుగుతుండటం గురించి మీకు వివరించాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

పర్వేష్ సాహిబ్ సింగ్ తన లేఖలో ఇప్పుడే ఈ పెరుగుతున్న మసీదులపై ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత వీటిని నియంత్రించడం కష్టం అవుతుందని తెలిపారు. ఎంసీడీ, ఎన్డీఎంసీ, పీడబ్ల్యుడీ, పోలీసులు, వరద నియంత్రణ విభాగం, ఇతర అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేయాలని అప్పీల్ చేశారు.