ఢిల్లీలో ఉష్ణోగ్రత 48 డిగ్రీలు!!

దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం పెరిగిపోయింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. జూన్ నెలలో ఢిల్లీలో ఇంత ఉష్ణోగ్రతలు ఇంతకు ముందెన్నడూ నమోదు కాలేదు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రత రికార్డయింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల స్థాయికి చేరడం చాలా అరుదని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 9, 2014న నగరంలోని పాలంలో 47.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది.


దేశ రాజధానిలో సోమవారం ఉదయం నుంచే వేసవి తడాఖా చూపించింది. కనిష్ట ఉష్ణోగ్రత సగటుతో పోలిస్తే ఒక డిగ్రీ తక్కువగా 27.2 డిగ్రీలుగా నమోదైంది. ఆకాశం నిర్మలంగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెప్పారు. రాబోయే రెండు రోజుల వరకు వడగాడ్పుల ప్రభావం నుంచి ఊరట లభించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీలు సెల్సియస్ గా రికార్డయింది. గరిష్ట ఉష్ణోగ్రతలు వేసవి సగటుతో పోలిస్తే 4 డిగ్రీలు ఎక్కువగా 43.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.