నీటి సంక్షోభంపై నిరసనలు ఆపొద్దు

నీటి సంక్షోభంపై నిరసనలు ఆపొద్దు

జలాశయాల పరిరక్షణకు కృషి చేసే సంస్థలతో కలిసి పనిచేయాలని మద్రాస్ హైకోర్ట్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ విధంగా చెప్పింది. రాష్ట్రంలో జల సంక్షోభాన్ని చాటి చెప్పేందుకు చేస్తున్న ఎలాంటి నిరసన ప్రదర్శనలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్జీవో అరాపుర్ ఇయక్కమ్ చెన్నై మహానగరాన్ని చుట్టుముట్టిన తీవ్ర నీటి ఎద్దడిపై జూన్ 30న వల్లువర్ కోట్టంలో నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు అనుమతిని ఇవ్వాల్సిందిగా జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ చెన్నై పోలీస్ కమిషనర్ ని ఆదేశించారు.

ఏ అంశంపై ప్రదర్శన చేయబోతున్నారో అది ఎంతో కీలకమైన అంశమని, దాని గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చెన్నై మహానగరంలో ప్రతి ప్రాంతంలో నీటి సరఫరా జరిగేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. కానీ మనం ఈ పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందో తెలుసుకోవాల్సి ఉంది. ఎన్నో జలాశయాలను ఆక్రమించడం వల్లనే వాస్తవంగా పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ అంశంపై లోతుగా ఆలోచించాల్సిన సమయం ఇదని, రాష్ట్రమంతటా దీనిపై అవగాహన కల్పించేందుకు ఎన్జీవో ముందుకొచ్చిందని చెప్పారు.