ప్ర‌తి కార్మికుడు ఒక సైనికుడు. -ఎంపి క‌విత‌.

సోషల్ మీడియా ద్వారా కోటి మందికి చేరుతున్నాం

హైదరాబాద్:

ప్ర‌తి కార్మికుడు ఒక సైనికుడిలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌నిచేయాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత పిలుపునిచ్చారు.సామాజిక మాధ్య‌మాల ద్వారా కోటి మందికి రీచ్ అవుతున్నామ‌ని, టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త కార్మికులుగా మ‌న‌పైనా ఉంద‌న్నారు.

సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన టిఆర్ ఎస్ కెవి స‌మావేశం సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు జి. రాంబాబు యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన ఎంపి క‌విత కార్మికుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలోని కార్మిక, ఉద్యోగుల‌కు భారీ స్థాయిలో జీతాలు పెంచింది టిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌న్నారు. తెలంగాణ‌లో ఉద్య‌మ సమ‌యంలో రంగాల వారీగా స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన కెసిఆర్ ముఖ్య మంత్రి అయ్యాక వాటిని ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నార‌ని తెలిపారు. ఇంకా రాష్ట్రంలో కొన్ని రంగాల కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల్సి ఉంద‌ని, భ‌విష్య‌త్తులో ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.119 నియెజ‌క వ‌ర్గాల్లో టిఆర్ఎస్ కెవి బ‌ల‌ప‌డ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.రాష్టంలోని 67 రంగాల్లో 25 ల‌క్ష‌ల స‌భ్య‌త్వం క‌లిగి 31 జిల్లా క‌మిటీల‌ను వేసుకుని నిర్మాణ‌ప‌రంగా సంఘం ప‌టిష్టంగా ఉంద‌న్నారు. ప్ర‌తి కార్య‌క‌ర్త సైనికుడిలా ఇళ్లిళ్లూ తిరిగి కార్మికుల కోసం అమ‌లు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని కోరారు. ల‌క్ష‌లాది మంది బీడి కార్మికుల‌కు వెయ్యి రూపాయ‌ల చొప్పున పెన్ష‌న్ ఇస్తున్న‌ది ..ఆటో, ట్రాక్ట‌ర్ల‌కు లైఫ్ టాక్స్ ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం ఆటో , ట్రాక్ట‌ర్ డ్ర‌యివ‌ర్లు ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణిస్తే రూ. 5 ల‌క్ష‌లు ప్ర‌మాద బీమాగా చెల్లిస్తుంద‌న్నారు. ఈ ప‌థ‌కం కింద 9.80 ల‌క్ష‌ల మందికి బీమా సౌక‌ర్యంను ప్ర‌భుత్వం వ‌ర్తింప చేసింద‌న్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు రూ. 2 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల‌కు ప్ర‌మాద బీమా మొత్తాన్ని పెంచార‌ని, దీని వ‌ల్ల 19 ల‌క్ష‌ల మందికి బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల రిజిస్ర్టేష‌న్లపై దృష్టి సారించాల‌ని ఎంపి క‌విత సంఘం బాధ్యుల‌ను కోరారు. మున్సిప‌ల్ కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశా వ‌ర్క‌ర్ల‌కు, అంగ‌న్ వాడీల‌కు, విద్యుత్‌, ఆర్టీసి, ఎన్జీఓ, విఓఎ, విఆర్ఎ, సెకండ్ ఎఎన్ ఎం, ఈసిఎఎన్ ఎం, లాబ్ టెక్నీషియ‌న్‌, స్టాఫ్ న‌ర్సులు, డాక్ట‌ర్లు, వేత‌నాలు పెంచ‌డం జ‌రిగింద‌ని ఎంపి క‌విత వివ‌రించారు.

జిహెచ్ఎంసి కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 6700 నుండి 14 వేల‌కు పెంచామ‌ని, పౌర‌స‌ర‌ఫ‌రా హ‌మాలీల‌కు రెండు సార్లు కూలీ రేట్లు పెంచామ‌ని, స్కూళ్ల‌లో ప‌నిచేస్తున్న పార్ట్ టైం స్వీప‌ర్ల‌కు 1680 నుంచి 4 వేల‌కు వేత‌నం పెరిగింద‌ని, సింగ‌రేణి కార్మికుల‌కు వ‌డ్డీ లేని రుణాలు, మంచి బోనస్‌, లాభాల్లో వాటా ఇచ్చామ‌న్నారు. ప్ర‌భుత్వ జూనియ‌ర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల‌లో వేత‌నాలు పెంచామ‌ని తెలిపారు.స‌మావేశంలో టిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్య‌ద‌ర్శి రూప్ సింగ్‌, టిఆర్ ఎస్ కెవి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి. నారాయ‌ణ‌, వి. మార‌య్య‌, నాగేశ్వ‌ర్ రావు, శార‌ద‌, చిలువేరు ప్ర‌భాక‌ర్‌, భార‌తి, కె. మాధ‌వి, వి. మాధ‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.