సినిమా ప్రొజెక్టర్ ఆవిష్కరణ!!

sitharam:

తొలి సినిమా ప్రొజెక్టర్‌ 1891 మే 20న ఆవిష్కరణ.సరిగ్గా 128 సంవత్సరాల క్రితం.
తొలి మూవీ ప్రొజెక్టర్‌ ద్వారా ప్రదర్శన జరిగింది!
సినీ చరిత్రలో అదొక మైలురాయిగా నిలిచింది!!
అప్పటికి ఫొటోల్లో బొమ్మ కనిపించడమే ఓ విచిత్రం. అలాంటిది ఆ బొమ్మ కదలడం ఓ అద్భుతమే! ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన పరికరం పేరు ‘కినెటోస్కోప్‌’. దీన్ని మూవీ ప్రొజెక్టర్‌ అని విస్తృతార్థంలో అనలేకపోయినా, దానికి నాంది పలికిన పరికరం అనుకోవచ్చు. ఆ పరికరానికి ఉన్న ఓ చిన్న కన్నంలోంచి వీక్షకుడు చూసినప్పుడు, అందులోని ఫిలిం వేగంగా కదులుతూ అందులోని ఓ తెరపై కదిలే బొమ్మ కనిపిస్తుంది. దీన్ని తయారు చేసినవాడు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిషన్‌. దీన్ని తొలిసారిగా ఓ క్లబ్‌లోని మహిళల ముందుకు 1891 మే 20న తీసుకువచ్చారు. దాని ద్వారా ప్రదర్శించిన మూవీ నిడివి కేవలం 3 సెకన్లు మాత్రమే! ఎడిసన్‌ అనుచరుడు డిక్సన్‌ తన తల మీది టోపీని తీసి తలవంచి నవ్వడం అందులో కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘డిక్సన్‌ గ్రీటింగ్‌’ అని అంటారు. ఆ తర్వాత దీన్ని మరింత అభివృద్ధి చేసి 1893 మే 9న బ్రూక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్రేక్షకులకు మూవీ ప్రదర్శన చేశారు.