అమెరికాలో తప్పిన భారీ విమాన ప్రమాదం

అమెరికాలోని ఫ్లోరిడాలో 136 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737 విమానం రన్ వే నుంచి జారి సెయింట్ జాన్ నదిలో పడిపోయింది. ఈ సమాచారం నేవల్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు అందించారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు తెలియ రాలేదు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.40 నిమిషాలకు జరిగింది. విమానం రన్ వేపై దిగేందుకు ప్రయత్నిస్తుండగా జారిపోయి నదిలో పడింది. విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నట్టు జాక్సన్ విల్లే మేయర్ ట్వీట్ చేశారు. నీళ్లలోకి జెట్ ఇంధనం కారిపోకుండా విమాన సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానంపై మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ లోగో ఉన్నట్టు చెబుతున్నారు. మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ ఒక ఛార్టర్డ్ ఎయిర్ లైన్ సేవలు అందించే సంస్థ. ఈ సంస్థ దగ్గర బోయింగ్ 737-800 పూర్తి ఫ్లీట్ ఉంది. ఇప్పటి వరకు ఈ సంఘటనపై కంపెనీ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కానీ బోయింగ్ ప్రతినిధి మాత్రం ఈ సంఘటనపై కంపెనీకి సమాచారం వచ్చిందని చెప్పారు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్టు వివరించారు.