ఆయుధాలు విడవండి, భోజనానికి రాజ్ భవన్ కి రండి….

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మలిక్ బుధవారం ఆయుధాలు విడిచిపెట్టాల్సిందిగా ఉగ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. చర్చల కోసం రాజ్ భవన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాజ్యాంగ పరిధికి లోబడి వారు కోరేది లభించేలా చేయగలిగేది కేవలం చర్చలు మాత్రమేనని సత్యపాల్ మలిక్ స్పష్టం చేశారు. హింసా మార్గంలో భారత్ ను లొంగదీయలేరని ఆయన స్పష్టం చేశారు. తన పరిపాలనలో విజయాల గురించి మీడియా సమావేశంలో వివరిస్తూ ‘మా నుంచి అన్నీ తీసుకోండి, మేం మా ప్రాణాలు కూడా ఇస్తాం. కానీ ప్రేమ, చర్చల ద్వారా మాత్రమే. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారు. మేం తయారుగా ఉన్నాం. చర్చలకు రండి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లండని’ ఉగ్రవాదులకు పిలుపునిచ్చారు.

యువత నిరుద్యోగం మాత్రమే కశ్మీర్ లో ఉగ్రవాద సమస్యకు కారణం కాదని, కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. ప్రజలకు స్వాతంత్ర్యం అని, స్వయం ప్రతిపత్తి అని రంగుల కలలు చూపించారని విమర్శించారు. ఇవేవీ పనిచేయనపుడు వేర్పాటువాదంతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని అన్నారు. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి గురించి మాట్లాడుతూ ఇది కశ్మీర్ వినాశనానికి దారి అని సత్యపాల్ మలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ యువతకు ఆయుధాలు వీడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయుధాలు విడిచిపెట్టి తనతో భోజనం చేసేందుకు రాజ్ భవన్ రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత వాళ్లు ఎంచుకున్న మార్గంతో కశ్మీర్ కు ఏం దక్కుతుందో ఆలోచించాలని సూచించారు.