హిందూరాజ్య స్థాపన!!


Rathnakunar:

దేశంలో 40% హిందువులు మేల్కొంటేనే భాజపాకు 300+ సీట్లొచ్చాయి. ఇక 80% మేల్కొంటే పరిస్థితి ఎలాఉంటుందో ఊహించగలరా ..! అంటూ మోడీ గణం గగనతలం లాంటి భవిష్యత్తుకు ఇప్పుడే నిచ్చెనలేస్తూ లెక్కలేసేస్తున్నారు. 80% మేల్కొంటే ఏమవుతుంది? మజ్లిస్ కు హైదరాబాద్ పాతబస్తీ ఎలా తయారయ్యిందో ఇక యావద్భారతం భాజపాకు అలా మారిపోతుంది. అభివృద్ధి జోలికెళ్ళకున్నా ‘స్వీయవర్గ రక్షకుని’ హోదాలో మజ్లిస్ గత 35ఏళ్ళుగా మెట్రో వంతెన స్థంభంలా పాతుకుపోయింది. రేపు 80%హిందువులు చైతన్యవంతులైతే ఇక భాజపా పని సులువైపోతుంది. ప్రజలకోసం అభివృద్ధి ఏమీ చేయకపోయినా అడపా దడపా పాకిస్థాన్ లేదా ఏ ఇతర ముస్లిం దేశాలపైనైనా విషం కక్కుతూ ఉంటే…స్వజనం మనస్సులు ‘రీఛార్జ్’ అవుతుంటాయి. అరుణాచల్ ప్రదేశ్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నప్పటికీ చైనాను పల్లెత్తు మాట అనరాదు. ఎందుకంటే సదరు చర్య హిందువుల హృదయాల్ని గెల్చుకోవడంలో వారి ఓట్లు పొందడంలో ‘.001%’ కూడా ఉపయోగపడదు. కాబట్టి భాజపా విధానమంతా ముస్లిం వ్యతిరేక ధోరణితో నిండిఉండాలి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400సీట్లలో ఒక్కదాన్ని సైతం ముస్లింలకు భాజపా కేటాయించలేదు. అంటే దానర్థం ఏమిటి? పార్టీకి ముస్లింలూ వారి ఓట్లూ అవసరం లేదనేగా! లేకుంటే భాజపా టిక్కెట్ పై పోటీచేసి గెలిచే దమ్మూ సామర్థ్యమూ సత్తా ముస్లింలకు లేవన్న స్థిరమైన భావనతోనైనా పార్టీ అలా వ్యవహరించి ఉండాలి. దానికి తగ్గట్టుగానే 2019లోక్ సభ ఎన్నికల్లోనూ మెజారిటీ మతస్థుల ఓట్లను కొల్లగొట్టే లక్ష్యంతోనే భాజపా ప్రతిఅడుగూ వేసింది. ప్రతిచోటా హిందూ జపమే చేసింది.
శ్రీ కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకే ..ఆంధ్రప్రదేశ్ లోని పాతపట్నం(శ్రీకాకుళం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఆభ్యర్ధి కలమట మోహనరావు ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యారు. మరిప్పుడు భాజపా చేసిందీ చేస్తున్నదీ ఏమిటి? హిందూత్వాన్ని మరిపించే కాషాయవస్ర్త ధారణలో ముఖ్యమంత్రి వంటి ఉన్నతస్థాయి వ్యక్తి ఉండడం హిందువులను పరోక్షంగా ప్రభావితం చేయడం కాదా? త్యాగ గుణాన్ని ప్రతిబింబించే వస్త్రధారణగా సమర్దించుకునే వాదనలో నిజమెంత శాతం ఉంటుంది? మజ్లిస్ ఇత్తెహదుల్ ముసల్మీన్(ఎం.ఐ.ఎం) లో ముస్లింలను పరిరక్షించేందుకు పనిచేసే సంస్థ అనే అర్థం ఉంటుంది. హైదరాబాద్ లో భాజపా ఎదుగుదల కూడా మజ్లిస్ వ్యతిరేక పునాదులమీదే ఎక్కువభాగం జరిగింది. మరి భాజపా కూడా హిందూ జనతా పార్టీగా మారితే మరింత భేషుగ్గా ఉండటంతోపాటు 80% హిందువుల హృదయాల్లో తిష్టవేయాలన్న లక్ష్య సిద్ధి కూడా సులభతరమైపోతుంది!