కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు! దేవెగౌడ వివరణ

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు! దేవెగౌడ వివరణ

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని సూచనప్రాయంగా చెప్పారు జెడిఎస్ అధినేత హెచ్ డి దేవెగౌడ. దేవెగౌడ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను భూకంపమే ఏర్పడింది. ఆ తర్వాత కాసేపటికే జెడిఎస్ చీఫ్ తన ప్రకటనపై యు టర్న్ తీసుకున్నారు. తను శాసనసభ ఎన్నికల గురించి చెప్పలేదని స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడానని అన్నారు. అంతకు ముందు దేవెగౌడ కాంగ్రెస్ తీరుపై కారాలు మిరియాలు నూరుతూ కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ నేతల వైఖరిని ప్రశ్నించారు. మధ్యంతర ఎన్నికల గురించి తన ప్రకటనపై ప్లేటు మారుస్తూ దేవెగౌడ ‘నేను స్థానిక సంస్థల ఎన్నికల గురించి చెప్పాను. శాసనసభ ఎన్నికల గురించి కాదు. నేను మా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నా కుమారుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం తన పూర్తి పదవీకాలం పూర్తి చేస్తుంది. జెడిఎస్, కాంగ్రెస్ మధ్య మంచి సహకారం ఉందని’ తెలిపారు.

దానికి ముందు దేవెగౌడ సంకీర్ణ ప్రభుత్వంపై సందేహం వ్యక్తం చేశారు. తాను మొదటి నుంచి రాష్ట్రంలో జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణానికి అనుకూలంగా లేనని మాజీ ప్రధాని అన్నారు. సోనియాగాంధీ ఈ సంకీర్ణం గురించి తనను అడిగారని, ఆ తర్వాతే తాను అందుకు అంగీకరించానని చెప్పారు. సంకీర్ణం ఆలోచన తనది కాదని, రాహుల్ గాంధీ, యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ లదని తెలిపారు. కాంగ్రెస్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ దేవెగౌడ ‘మధ్యంతర ఎన్నికలు వస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. వాళ్లు(కాంగ్రెస్) పూర్తి 5 ఏళ్లు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ల తీరు చూడండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.