ఐయామ్ వెరీ సారీ అనూష!!

ప్రకాశ్, న్యూఢిల్లీ;

దేశంలో సామాన్య, గ్రామీణ యువతకు ఇంగ్లిష్ నవలలను పరిచయం చేసిన ప్రముఖ రచయిత చేతన్ భగత్‌పై కూడా ఓ మహిళా జర్నలిస్ట్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. షీనా అనే యువతికి చేతన్‌ వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారు. చేతన్ భగత్ తనకు పంపిన అసభ్యకర మేసెజ్‌లు, ఫ్లర్ట్ చేసిన చాట్ స్క్రీన్‌షాట్స్‌ను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘మీకు పెళ్లయింద’ని గుర్తు చేస్తే అది ఓ గుర్తింపు మాత్రమేనని చేతన్ జవాబిచ్చాడు. తనను ప్రేమించమని చేతన్ వేధించాడని షీనా వాపోయింది. భగత్ వేధింపులు తట్టుకోలేక ఫేస్ బుక్ లో అతడిని బ్లాక్ చేశానని మరో యువతి ఫేస్ బుక్ లో బయటపెట్టింది.సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. పలువురు నెటిజన్లు చేతన్ వేధింపులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో చేతన్‌కి తన తప్పును ఒప్పుకోక తప్పలేదు. తన కారణంగా బాధపడిన మహిళలతో పాటు భార్య అనూషాకు సైతం ఫేస్ బుక్ లో క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చాడు. ‘నా మెసేజ్‌ స్క్రీన్‌షాట్స్‌ గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను వాటిని చూడటం ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు వివరణ ఇస్తున్నాను. ముందుగా నా వల్ల ఇబ్బందిపడ్డ నా భార్య అనూషకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఆ స్క్రీన్‌షాట్స్‌లో ఉన్నదంతా నిజమే. నన్ను క్షమిస్తావని ఆశిస్తాను. ఆ స్క్రీన్‌షాట్స్‌ కొన్నేళ్ల కిందటివి. ఆ అమ్మాయిని నేను చాలాసార్లు కలిశాను. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఇదే విషయాన్ని నేను ఆ మెసేజ్‌లలో కూడా తెలిపాను. ఆమె మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది. నేను పెళ్లయినప్పటికీ కొంతకాలం నా భార్యతో అనుబంధాన్ని మిస్సయ్యాను. నేనే కాదు.. ఆమె కూడా నాతో మానసికంగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఆమె చేసిన మెసేజ్‌లు చూస్తే అది అర్థం అవుతోంది. ఒక్క విషయం మాత్రం నిస్సంకోచంగా చెప్పగలను. మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఒకరికొకరి ఎలాంటి అసభ్యకర ఫొటోలు పంపుకోలేదు. నేను కలిసిన వాళ్లలో ఆమె ఎందుకో ప్రత్యేకంగా అనిపించింది. ఏదేమైనా ఆ అమ్మాయితో నా వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఉండాల్సింది. మరోసారి ఆ యువతికి, నా భార్యకు క్షమాపణలు చెబుతున్నాను.’
చేతన్ రాసిన ‘త్రీ పాయింట్ సమ్ వన్’ పుస్తకం త్రీ ఇడియట్స్ పేరుతో తెరకెక్కింది. ఇక ‘టూస్టేట్స్’ పుస్తకం కూడా సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.