ఇమ్రాన్ ఖాన్ ని చీల్చి చెండాడుతున్న ట్విట్టర్

ఇమ్రాన్ ఖాన్ ని చీల్చి చెండాడుతున్న ట్విట్టర్

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతున్నారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ పంక్తులను మరో రచయితవిగా పేర్కొంటూ పెట్టిన పోస్ట్ ని ఇంటర్నెట్ యూజర్లు చీల్చి చెండాడుతున్నారు.

ఇవాళ ఇమ్రాన్ తన ఖాతాలో కొన్ని స్ఫూర్తిదాయక వాక్యాలను పోస్ట్ చేశారు. ‘I slept and I dreamed that life is all joy. I woke and I saw that life is all service, I served and I saw that service is joy(నేను నిద్రించాను. జీవితం అంతా సంతోషంగా ఉన్నట్టు కల గన్నాను. నేను మేల్కొన్నాను. జీవితం అంతా సేవ అని చూశాను. నేను సేవ చేశాను. సేవే సంతోషమని గుర్తించాను.)’ అని ఆ వాక్యాల్లో ఉంది.

ఈ వాక్యాలను పోస్ట్ చేస్తూ ఆయన ‘ఈ కింద పేర్కొన్న జిబ్రాన్ మాటల్లోని వివేకాన్ని ఎవరైతే గుర్తించి అర్థం చేసుకోగలరో, వాళ్లు జీవితాన్ని సంతృప్తిగా గడపగలరు’ అని రాశారు.

ఇమ్రాన్ పోస్ట్ ప్రకారం ఈ వాక్యాలు లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ వి. కానీ నిజానికి అవి సుప్రసిద్ధ భారతీయ కవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy (నేను నిద్రించాను. సంతోషమే జీవితమని కలగన్నాను. నేను మేల్కొన్నాను జీవితం సేవ అని చూశాను. నేను వెంటనే సేవ చేయడం ప్రారంభించాను, సేవే సంతోషం)’ అనే వాక్యాలు రాశారు.

ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక అకౌంట్ లో ఈ బొమ్మ పెట్టిన తర్వాత ట్విట్టర్ లో ఆయనను చీల్చి చెండాడుతూ అత్యంత వేగంగా ట్రోలింగ్ ప్రారంభమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ వాక్యాలను ఖలీల్ జిబ్రాన్ కి ఆపాదించడంపై విమర్శల జడివాన కురిసింది.