హైదరాబాద్ కి బుల్లెట్ ట్రెయిన్!!

విశ్వనగరం హైదరాబాద్ కి సైతం బుల్లెట్ ట్రెయిన్ పరుగులు రానున్నాయి. ఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో సైతం బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులు చేపట్టే ప్రణాళిలు ఉన్నట్టు సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ డైరెక్టర్ టోర్కెల్ ప్యాటర్సన్ ప్రకటించారు. భారత్ లోని మరో ఐదు ప్రాంతాల్లో బుల్లెట్ ట్రెయిన్ గా వ్యవహరించే హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ ఆలోచనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని ప్యాటర్సన్ చెప్పారు. ప్రభుత్వం ముంబై-అహ్మదాబాద్ సెక్టర్ లో చేపట్టిన బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్ట్ ని 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇది ఏడాది ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయ్యాక మిగతా ఐదు నగరాల్లో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్ట్ చేపట్టే ప్రతిపాదనపై చర్చలు ప్రారంభిస్తారు. న్యూఢిల్లీ, కోల్ కతా, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఇంటర్నేషనల్ హైస్పీట్ రైల్ అసోసియేషన్ (ఐహెచ్ఆర్ఏ) వైస్ చైర్మన్ అయిన టోర్కెల్ ప్యాటర్సన్ ద ప్రింట్ కు వెల్లడించారు.

జపాన్ ప్రైవేట్ రైల్వే సంస్థ జెఆర్-సెంట్రల్ ముంబై-అహ్మదాబాద్ ల మధ్య హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ను నిర్మిస్తోంది. 505కి.మీల పొడవైన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను 12 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2017న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు దీనిని అధికారికంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై డిసెంబర్ 2015లో సంతకాలు చేశారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 320కి.మీల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ముంబై-అహ్మదాబాద్ మధ్య దూరాన్ని 2 గంటల 7 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. భూ సేకరణ ఇబ్బందుల కారణంగా 2023కి ముందు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే అవకాశం లేదని ప్యాటర్సన్ వివరించారు.

జపాన్ కు చెందిన ‘షింకాన్సెస్’ టెక్నాలజీని ఉపయోగించుకొనే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ జపాన్ మాదిరిగానే భారత ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తుందని ప్యాటర్సన్ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి కీలకమైన నగరాలను ఇది కలుపుతుందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులను దేశంలో ఎక్కడ పడితే అక్కడ, అంతటా ఏర్పాటు చేయరాదని.. కేవలం ఆర్థిక హబ్ ల దగ్గర మాత్రమే నిర్మించాలని సూచించారు. అందుకే తాము భారత ఆర్థిక రాజధాని అయిన ముంబైని, దేశ వజ్రాల వ్యాపారానికి గుండెకాయ వంటి అహ్మదాబాద్ లను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు.