కడియం, జూపల్లి అయోమయం!!

Hyderabad:

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,మాజీమంత్రి జూపల్లి రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా ఉన్నట్టు ఉమ్మడి మహబూబ్ నగర్,ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి రిపోర్టులు అందుతున్నవి. కడియం శ్రీహరి బీజేపీ చేరనున్నారంటూ వదంతులు వ్యాపించాయి. ఆయన వాటిని కొట్టిపారేశారు.ఇంకా జూపల్లిపై ఇలాంటి ఊహాగానాలేవీ రాలేదు. రాజకీయాల్లో కొన్ని పరిణామాలు వింతగా, విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయి. ఓడలు, బండ్లుగా మారతాయి. బండ్లు, ఓడలుగా మారతాయి. తాజా రాజకీయాల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. బండ్లుగా మారిన ఓడల్లాంటి ఈ ఇద్దరు నాయకుల గురిం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులే ఇప్పడు చతికిల బడ్డారు. టిఆర్ఎస్ వనంలో ఇలాంటి విషాదగీతాలుఎన్నో ఉన్నవి.కడియం,జూపల్లి గురించి పట్టించుకునే తీరుబాటు కేసీఆర్ కు లేకపోవచ్చు.తమకు సరైన ఆదరణ లేదనో, లేదా ప్రాధాన్యం లేదనో అసంతృప్తికి గురవుతున్న నాయకులు చాలా మందే ఉన్నారు.జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఆధిపత్యం చెలాయించారు. ఆయన వ్యవహార శైలికి నిరసనగా ఆ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆయనకు దూరమవడం ఇంకో కోణం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా అంతటా గెలిచిన టీఆర్ఎస్, ఒక్క కొల్లాపూర్ లో మాత్రం ఓడింది. అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు.

జూపల్లి ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఇప్పటికీ చర్చ ఉన్నది. జూపల్లి ఓటమితో పాటే టీఆర్ఎస్ పార్టీలో పరపతిని కూడా కోల్పోయారు. జూపల్లిని ఓడించిన హర్షవర్ధన్ రెడ్డి, గులాబీ గూటికి చేరడం జూపల్లి పై పిడుగుపాటు. హర్షవర్ధన్ రెడ్డీ కొల్లాపూర్ లో కింగ్ గా మారారు. మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన వైపే ఉన్నారు. మొన్నటి మండల, జిల్లా పరిషత్ న్నికల్లోనూ హర్షవర్ధన్ రెడ్డి హవా చూపారు. టీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హర్షవర్ధన్ కు గట్టి మద్దతు ఇస్తున్నట్టు టిఆర్ఎస్ పాలమూరు వర్గాల్లో ప్రచారం ఉన్నది. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన జూపల్లి ఇప్పుడు ఏకాకి గా మారడం విషాదం. నియోజకవర్గంలోని అధికారులుగానీ, పోలీసులుగానీ సహజంగానే ఇప్పుడు జూపల్లి మాటను ఖాతరు చేయడం లేదు. కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ఎక్కువ కాలం ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు.

తెలంగాణ తొలి టర్మ్ లో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కారణాలు ఏవైనా కడియం ఏకాకిగా మారారు. కేసీఆర్ రెండో మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కేవలం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితులలో కడియం పార్టీ మార్పు పై ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. వాటిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీలో తన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కడియం జీర్ణించుకోలేకపోతున్నారని వరంగల్ నుంచి సమాచారం అందుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి డాక్టర్ రాజయ్య అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించారు.టికెట్‌ను తన కుమార్తె కావ్యకు ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినప్పటికీ కడియం సర్దుకుపోయారు. కేటీఆర్ దౌత్యంతో రాజీ కుదిరింది. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రాధాన్యం తగ్గింది. క్యాబినెట్ మలి విస్తరణలో కడియం శ్రీహరికి చోటు దక్కుతుందో లేదో ఇప్పుడే అంచనా వేయలేము.