ఐటీ దాడులపై రోడ్డెక్కిన కర్ణాటక సీఎం కుమారస్వామి

ఐటీ దాడులపై రోడ్డెక్కిన కర్ణాటక సీఎం కుమారస్వామి

karantak cm

ఇవాళ చాలా మంది జెడిఎస్ నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి బెంగుళూరులోని ఐటీ శాఖ భవనం బయట నిరసన ప్రదర్శన చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం జి పరమేశ్వర, సిద్దరామయ్య, డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండురావు, పలువురు కాంగ్రెస్, జెడిఎస్ నేతలు, కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. గౌడ బలమైన ప్రాంతాలుగా భావించే హసన్, మాండ్యాలలో ఆదాయపన్ను శాఖ పలువురు జేడీఎస్ నేతల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రెండు జిల్లాలలోని పలు ప్రాంతాలలో జరిపిన సోదాలు, స్వాధీనం ఆపరేషన్లలో వందలాది అధికారులు పాల్గొన్నారు. ఈ రెండు జిల్లాల నుంచే జెడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ మనవలు ప్రజ్వల్ రేవణ్ణ, నిఖిల్ కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

‘ఆదాయపన్ను శాఖ స్వతంత్రంగా పనిచేయాలి. కానీ అది మోడీ, అమిత్ షాల సూచనల మేరకు పని చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా నియంతృత్వంగా మారిపోయింది. బెంగుళూరులోని ఐటీ డైరెక్టర్ అమాయకుడని అనుకుంటున్నారా? నా దగ్గర చాలా రికార్డులున్నాయి’ అని చెప్పిన కుమారస్వామి, డైరెక్టర్ కి ముంబైలో ఎన్నో అపార్ట్ మెంట్లు ఉన్నాయని తెలిపారు. బీజేపీతో ఐటీ శాఖ డైరెక్టర్ కు అంతర్గత అవగాహన కుదిరిందని అందులో భాగంగా మరో మూడు నెలల్లో రిటైరయ్యే ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని కర్ణాటక సీఎం చెప్పారు.

రాజకీయ దురుద్దేశంతో తన పార్టీ నాయకులపై ఐటీ దాడులు జరిగాయని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన కుమారస్వామి కొన్ని గంటలకే ఐటీ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఈ దాడుల వెనుక ప్రధాని మోడీ ఉన్నారని కుమారస్వామి ఆరోపించారు. తన ట్వీట్ లో కర్ణాటక-గోవా ఐటీ కమిషనర్ బాలకృష్ణన్ పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రిటైరైన తర్వాత రాజ్యాంగ పదవి కోసమే బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను బాలకృష్ణన్ వేధిస్తున్నారని విమర్శించారు.

ఈ దాడులను ప్రధాని మోడీ నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ గా అభివర్ణించిన కుమారస్వామి, రాజకీయ ప్రతీకారం సాధించేందుకు ప్రభుత్వ సంస్థలను కేంద్రవ ఉపయోగించాలని చూస్తే తాను కూడా మమతా బెనర్జీ వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత నెల శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసుల్లో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ని ప్రశ్నించేందుకు సీబీఐ బృందం ఆయన ఇంటికి వెళ్లినపుడు బెంగాల్ చీఫ్ మినిస్టర్ ధర్నాకు దిగారు.