చెట్లపైకి దూసుకెళ్లే బైక్

కర్ణాటకలో ఒక రైతు చెట్లపైకి ఎక్కే బైక్ ను రూపొందించాడు. ఈ బైక్ తో ఎంత ఎత్తైన చెట్టునైనా అలవోకగా ఎక్కేయొచ్చు. ఈ బైక్ మీద కూర్చొని కొన్ని క్షణాల్లో సమతలంగా ఉన్న ఎలాంటి చెట్టునైనా చకచకా ఎక్కిపోవచ్చు. దీనిని పోక చెట్లను ఎక్కేందుకు ప్రత్యేకంగా తయారు చేశాడు.

మంగుళూరుకు చెందిన రైతు గణపతి భట్ ఈ మెషీన్ ని నిర్మించాడు. ఈ మెషీన్ పై 60-80 కిలోల బరువున్న వ్యక్తులు ఎక్కి కూర్చొని సునాయాసంగా చెట్ల చిటారుకొమ్మలకు చేరుకోవచ్చు. చెట్లపైకి ఎక్కే ఈ బైక్ రూపకల్పనలో ఎక్కిన వ్యక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చెట్లు ఎక్కేటపుడు ఎదురయ్యే సమస్యలను ఈ బైక్ చెరిపేసింది.

ఈ బైక్ పెట్రోల్ తో నడుస్తుంది. ఇందులో మామూలు బైక్ మాదిరిగానే క్లచ్, బ్రేక్ ఉంటాయి. ఒక్క లీటర్ పెట్రోల్ తో ఇది 80 పెద్ద చెట్లను ఎక్కి దిగడం మొబైక్ గా పిలుస్తున్న ఈ బైక్ ప్రత్యేకత. ఇంత గొప్ప ఆవిష్కరణను తయారుచేసిన గణపతి భట్ మాత్రం తన ఈ ప్రయత్నం చాలా చిన్నదని వినయంగా చెబుతున్నాడు.