సీఎం కేసీఆర్‌తో ట్రబుల్ షూటర్ భేటీ!!

సీఎం కేసీఆర్‌తో
ట్రబుల్ షూటర్ భేటీ!!

హైదరాబాద్:

గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ట్రబుల్ షూటర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో హరీష్‌ సమావేశమయ్యారు. హరీష్‌తో పాటు కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నిశితంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశం మరో గంటపాటు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమీక్షలో పార్లమెంట్ ఎన్నికల్లో అసలేం జరిగింది..? ఎందుకు ఇలా ఫలితాలు రివర్స్ అయ్యాయి..? కవిత ఓటమిపై ముఖ్యంగా చర్చించే అవకాశాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు దేశ వ్యాప్తంగా మెజార్టీ రాదని చెప్పిన కేసీఆర్.. తెలంగాణలోనే ఆ రెండు పార్టీలు 7 సీట్లు దక్కించుకోవడంతో కేసీఆర్ ఒకింత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… కేసీఆర్-హరీష్ భేటీ జరిగి సుమారు ఆరునెలలకు పైగా అయ్యింది. డిసెంబర్-11 ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్‌తో హరీష్ భేటీ కావడం గమనార్హం. కాగా ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో హరీష్ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు కేసీఆర్-హరీష్ మధ్య ఏం జరిగింది..? హరీష్ ఎందుకు దూరంగా ఉంటున్నారు..? హరీష్‌కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..? హరీష్ పార్టీ మారుతారా..? హరీష్ కొత్త పార్టీ పెడతారా..? ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే తాజా భేటీతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై చూసుకున్న హరీష్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మెదక్ దాటి బయటికెళ్లలేదు. మొత్తానికి చూస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల చూసిన అధిష్టానానికి హరీష్ రంగంలోకి దిగని లోటు స్పష్టంగా కనపడిందని చెప్పుకోవచ్చు.కేపి