కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పారు

కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పారు

కొడుకు ముఖ్యమంత్రి కాలేరని వాస్తు పండితులు చెప్పినందువల్లే కేసీఆర్ సచివాలయ భవనాలు కూల్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. వాస్తు పండితులు చెప్పినట్లు కొత్త సచివాలయ భవనాల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సీఎం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వందేళ్ల కోసం భవనాలను నిర్మిస్తారని.. ప్రస్తుత సచివాలయంలో నిర్మించి 15 ఏళ్లు కూడా కాని వందల కోట్ల విలువైన కొన్ని భవనాలు కూడా కూల్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు సిద్ధమవుతున్నారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. గురుకులాలకు భవనాలు లేదు, వేతనాలు ఇవ్వడం లేదు, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు లేవు కానీ తను విలాసవంతంగా ఉండేందుకు ఖజానా ఖాళీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాధనానికి కాపలాగా ఉండాల్సిందిపోయి వృథా చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర జనాభా 10 కోట్లకు చేరుకున్నా భవనాలు కూల్చకుండా పాలన చేసే సౌలభ్యం ప్రస్తుతం సచివాలయంలో ఉందని.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించినా ఇంకా స్థలం ఉంటుందని ఆయన అన్నారు. ఉదయం నుంచి సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన లేకపోవడంతో వినతి పత్రం ఇచ్చివచ్చినట్టు తెలిపారు.

ప్రజాధనం దుర్వినియోగాన్ని కాంగ్రెస్ కచ్చితంగా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం ఆలోచనను విరమించకుండా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు ప్రధాని, రాష్ట్రపతి అయ్యారని.. సచివాలయం ఇక్కడ ఉండగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. భవనాలు లోపభూయిష్టంగా ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్ప వందేళ్ల కోసం వందల కోట్లతో కట్టిన భవనాలను ఉన్న ఫళంగా కూలగొడతామంటే ఒప్పుకోబోమని రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తును నమ్మవచ్చు కానీ పిచ్చిగా వ్యవహరించరాదని సూచించారు.