వైరల్ వీడియో: ట్రంప్ మాస్క్ తో దొంగతనం

ఈ మధ్య దొంగలు మొహం కనపడకుండా ముసుగులు వేసుకోవడానికి బదులు ప్రముఖ వ్యక్తుల మాస్క్ లు తగించుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది. ఒక దొంగ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకొని ఒక షాపింగ్ సెంటర్ లో దొంగతనం చేశాడు. పోలీసులు దీనికి సంబంధించిన వీడియో పెట్టగానే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోని షేర్ చేస్తూ క్వీన్స్ లాండ్ పోలీసులు ‘ఇవాళ ఉదయం ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాస్క్ పెట్టుకొని దొంగతనం చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు మీ సహాయం కోరుతున్నారు. మీరు సాయపడగలరా?’ అని రాసింది.

ఈ సీసీటీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి షాపింగ్ సెంటర్ అద్దాన్ని బద్దలుకొడుతూ కనిపిస్తున్నాడు. ఆ తర్వాత యాంగస్&కూట్ అనే స్టోర్ లోకి చొరబడి బోలెడు నగదు, వస్తువులు దొంగతనం చేస్తున్నాడు. ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ తొడుగు పెట్టుకొని ఈ లూటీ చేయడం ఆసక్తికరంగా మారింది.

వార్తాకథనం ప్రకారం చోరీ జరిగిన షాపింగ్ సెంటర్ బ్రిస్బేన్ నగరం సమీపాన ఉన్న స్ట్రాథ్ పైన్ లో ఉంది. దొంగ ఉదయం 5.30కి లూటీ చేశాడు. వీలైనంత త్వరగా చోరుడిని పట్టుకొనేందుకు పోలీసులు సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టారు.