10 ఐఎస్ అనుమానిత స్థావరాలపై ఎన్ఐఏ దాడులు

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో ఎనిమిది మందిపై దాఖలైన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం తమిళనాడులోని 10 చోట్ల దాడులు చేసింది. మూడు జిల్లాల్లోని ఎనిమిది మంది అనుమానితులపై ఎనిమిది సెక్షన్ల కింద జనవరి 8న కేసు నమోదైంది. వీళ్లంతా ఐఎస్ కు మద్దతిస్తూ భారత్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. భారత కారాగారాల్లో ఉన్న జిహాదీలను విడుదల చేయించడానికి ప్రణాళికలు రచిస్తున్నారని అరోపించడమైంది.

రామనాథపురం, సేలం, చిదంబరంలలోని షేక్ దావూద్, మొహమ్మద్ రియాజ్, సాదిక్, ముభారిస్ అహ్మద్, రిజ్వాన్, హమీద్ అక్బర్ ల నివాసాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దర్యాప్తునకు హాజరు కావాల్సిందిగా వీళ్లకు కబురు పంపిస్తే రాలేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు తమిళనాడులోని ఎనిమిది చోట్ల ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై, మూడు ప్రాంతాల్లోని తౌహీద్ జమాత్ ఆఫీసులపై మే 2న ఏజెన్సీ దాడులు చేసింది.

ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో 253 మందిని బలిగొన్న వరుస పేలుళ్లతో భారత సంబంధాలను కనుగొనేందుకు ఈ దాడులు చేశారు. ఏప్రిల్ ఓల 29 ఏళ్ల రియాజ్ అబూబకర్ అరెస్ట్ తో తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్ స్లీపర్ సెల్స్ ఉన్నట్టు ఎన్ఐఏ కనుగొంది. ఇవి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో భారత్ లో తౌహీద్ జమాత్ ఆలోచనా విధానాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా ముతలమాడకు చెందిన రియాజ్ అబూబకర్ తాను శ్రీలంక బాంబర్ జహ్రాన్ హషీమ్, జకీర్ నాయక్ ల అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అంగీకరించాడు. తాను కూడా ఆత్మాహుతి దాడికి ప్రణాళిక రచిస్తున్నట్టు ఎన్ఐఏకి చెప్పాడు.