ఆర్థిక సంఘంలో ఒక్క దక్షిణాది సభ్యుడు లేరు

15వ ఆర్థిక సంఘంలో కనీసం ఒక్క దక్షిణ భారత సభ్యుడు కూడా లేకపోవడంపై కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి కృష్ణ బైరె గౌడ బుధవారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఐదుగురు సభ్యుల 15వ ఆర్థిక సంఘంలో దక్షిణ భారతదేశానికి చెందిన ఒక్క సమర్థుడైన వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వానికి కనిపించకపోవడం దురదృష్టకరం. గతంలో దక్షిణాదికి చెందిన అనేక మంది సభ్యులు దేశానికి తమ విలువైన సేవలు అందించారని’ కృష్ణ బైరె గౌడ ట్వీట్ చేశారు.

చైర్మన్ ఎన్ కె సింగ్ నాయకత్వంలోని 15వ ఆర్థిక సంఘంలో ఏ ఎన్ ఝా, డాక్టర్ అశోక్ లాహిరి, డాక్టర్ అనూప్ సింగ్, ప్రొఫెసర్ రమేష్ చంద్ సభ్యులుగా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా నియమితులు కాగానే శక్తికాంత దాస్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఏ ఎన్ ఝాని మార్చిలో నియమించడం జరిగింది. ఏప్రిల్ 1, 2020 నుంచి మొదలుకొని రాబోయే ఐదేళ్లలో కేంద్రం పన్నుల రూపంలో సేకరించిన ఆదాయాన్ని రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలో నిర్ధారించాల్సిన బాధ్యతను కమిషన్ కు అప్పజెప్పారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి నాయకత్వంలోని 14వ ఆర్థిక సంఘంలో ఎం గోవిందరావు, సుష్మానాథ్, అభిజిత్ సేన్, సుదీప్తో ముండ్లే, ఏఎన్ ఝా సభ్యులుగా ఉన్నారు.

తన వరుస ట్వీట్లలో కృష్ణ బైరె గౌడ కర్ణాటక ఎంతో కాలంగా కోరుతున్న కరువు సహాయం గురించి ప్రస్తావించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘2015-20 కాలానికి కేంద్ర కేటాయింపుల్లో కర్ణాటకకు అన్యాయం జరిగింది. కరువు, వరదల అవసరాల కోసం కర్ణాటకకు రాష్ట్ర కరువు సహాయ నిధి కింద రూ.1527 కోట్లు వచ్చాయి. మహారాష్ట్రకు రూ.8195 కోట్లు ఇచ్చారని’ ఆయన పేర్కొన్నారు. న్యాయబద్ధంగా సిఫార్సులు చేసి ఈ అన్యాయాలను సరిదిద్దాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని మంత్రి కోరారు.