నేను దేవుడిని, నవీన్ పట్నాయక్ జగన్నాథ స్వామి!!

ఒడిషా మంత్రి ఒకరు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ స్వామి అని చెప్పారు. మంత్రిగారి ప్రకటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిషా రెవెన్యూ, ప్రకృతి విపత్తుల నిర్వహణ మంత్రి సుదామ్ మరిండి శుక్రవారం తనను బఠోడీ వర్గం పూజించే బాదాం దేవతగా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సాక్షాత్తూ పూరీ జగన్నాథుడేనని అన్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఈ వ్యాఖ్యలు బరిపడలోని హరిబల్దేవ్ జ్యూ మందిర సేవకుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి.

తమ ఎనిమిది డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరుతూ బరిపడ నుంచి భువనేశ్వర్ లోని నవీన్ నివాస్ వరకు పాదయాత్ర ప్రారంభించిన సేవకులు ముందు తనతో చర్చించి ఉండాల్సిందని మరిండి బుధవారం అన్నారు. బంగిరిపోసి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను ఆ సేవకులు ముందుగా కలిసి చర్చించి ఉండాలని ఆయన అసలు ఉద్దేశం. అప్పటికీ వారి సమస్యలు తీర్చకపోతే ముఖ్యమంత్రిని కలవాలని మరిండి భావం. అయితే మరిండి వ్యాఖ్యలతో హరిబల్దేవ్ జ్యూ మందిర సేవకులు మండిపడ్డారు. తీవ్రంగా నిరసన తెలుపుతూ ఎమ్మెల్యేని జగన్నాథ స్వామి శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు.