వీడియో: టోల్ ప్లాజాలో మహిళా సిబ్బందిపై దాడి

గురుగ్రామ్ లో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆందోళనకు గురి చేసింది. టోల్ ప్లాజా దగ్గర దాడి వీడియోలు చాలానే చూసి ఉండొచ్చు. కానీ ఈ సారి వాహనదారుడు డబ్బులు అడిగిందని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ సంఘటన గురుగ్రామ్ లోని ఖేడ్కీ దౌలా టోల్ ప్లాజాలో జరిగింది.

నల్ల రంగు ఎస్ యువి కారు టోల్ ప్లాజా దగ్గర ఆగడం వీడియోలో కనిపిస్తోంది. కారు నుంచి ఓ వ్యక్తి దిగి టోల్ బూత్ వైపు వచ్చాడు. ఆ తర్వాత అతను మహిళ చేతిని పట్టుకున్నాడు. హఠాత్తుగా చెంపదెబ్బ కొట్టాడు. మహిళ క్యాబిన్ లోపల కూర్చొని ఉంది.

ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతనిని దూరం తీసుకెళ్లాడు. మహిళ బాధతో తన మొహాన్ని చేతుల్లో దాచుకుంది. కొన్ని సెకన్ల తర్వాత మహిళ ముక్కు నుంచి రక్తం కారుతోంది. ఏఎన్ఐ వార్తాసంస్థ కథనం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వాహనదారుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి మహిళపై ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదు. కానీ విశ్వసనీయ సమాచారంమేరకు అతను టోల్ ట్యాక్స్ కట్టడానికి నిరాకరించి దాడిచేసి పరారయ్యాడు.

ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ట్యాగ్ చేస్తూ చర్యలు చేపట్టాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హర్యానాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత నెల గుర్గావ్ లోనే డబ్బు అడిగినందుకు కారు వాహనదారుడు ఒకరు తప్పించుకు పారిపోయాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అయింది.