ఇవాళ్టి తర్వాత చైనాలో పబ్ జి ఉండదు

ఇవాళ్టి తర్వాత చైనాలో పబ్ జి ఉండదు

పబ్ జి మొబైల్ గేమ్ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ‘ప్లేయర్ అన్‌ నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’ అనే ఈ గ్లోబల్ బ్లాక్ బస్టర్ టెస్ట్ వర్షన్ ను బుధవారం చైనాలో మూసేసింది దీనిని రూపొందించిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్. ఇప్పటివరకు ఉన్న చైనా పబ్ జి యూజర్లను ఇలాంటిదే, మరికొంత దేశభక్తి ఉన్న వీడియో గేమ్ కి మార్చేసింది. పబ్ జి మాదిరి కాకుండా ఈ వీడియో గేమ్ కి రెవెన్యూ సాధించుకొనేందుకు నియంత్రణ అనుమతులు లభించాయి.

చైనాకు చెందిన వీడియో గేమ్ తయారీ సంస్థ దాదాపు ఏడాదికి పైగా పబ్ జి ద్వారా ఆదాయం ఆర్జించేందుకు అనుమతి కోరుతూ వేచి చూసింది. కానీ ఎంతకూ అనుమతులు రాకపోవడంతో కఠినమైన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఉండేందుకు దక్షిణ కొరియా తయారీ అయిన ఆటకు సోషలిస్ట్ హంగులద్ది కొత్తగా ప్రవేశపెడుతోంది.

చైనాకి చెందిన ట్విట్టర్ వంటి మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ప్లాట్ ఫామ్ లోని గేమ్ అధికారిక అకౌంట్ లో పెట్టిన పోస్టులో పబ్ జి టెస్టింగ్ ను మూసేస్తున్నట్టు టెన్సెంట్ ప్రకటించింది. దీని స్థానంలో యాంటీ టెర్రరిజమ్ థీమ్ తో రూపొందించిన ‘గేమ్ ఫర్ పీస్’ ను ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఈ ఆటకు ఏప్రిల్ లోనే మానిటైజేషన్ అనుమతులు వచ్చేశాయి.

ప్రస్తుతం చైనాలో సగటున రోజుకి దాదాపు 70 మిలియన్ల యాక్టివ్ పబ్ జి మొబైల్ యూజర్లు ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన గేమ్ ఫర్ పీస్ ఏటా 8 బిలియన్ యువాన్ల నుంచి 10 బిలియన్ యువాన్ల (1.18 – 1.48 బిలియన్ డాలర్లు) ఆదాయం ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటన రాగానే టెన్సెంట్ షేర్లు మధ్యాహ్నం ట్రేడ్ లో 2 శాతం పెరిగాయి.