డజను మంది మాజీ సీఎంలు గల్లంతు

ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్షాన్ని ఊడ్చి పెట్టేసింది. హిందీ రాష్ట్రాల్లో హడల గొట్టేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిషాలలో ప్రవేశించింది. గురువారం వెల్లడించిన లోక్ సభ ఎన్నికల ఫలితాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కాషాయ తుఫాను 303 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించిన తీరింది. కమల దళం సృష్టించిన ఓట్ల సునామీకి విపక్షం 50 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో పూర్తి మెజారిటీతో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెసేతర మొదటి ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించారు. చివరిసారిగా ఇందిరాగాంధీ 48 ఏళ్ల క్రితం 1971లో ఈ ఘనత సాధించారు. దేశమంతటా విరుచుకుపడిన కాషాయ కెరటాల హోరులో 8 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు సహా 12 మంది మాజీలు ఓటమి పాలయ్యారు.

షీలా దీక్షిత్
మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో 3.63 లక్షల ఓట్ల తేడాతో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చేతుల్లో ఓడిపోయారు.

దేవెగౌడ
కర్ణాటకలో అధికార సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ తుముకూరు నియోజకవర్గంలో బీజేపీ ప్రత్యర్థి జిఎస్ బసవరాజ్ పై 13,000 పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

దిగ్విజయ్ సింగ్
భోపాల్ నుంచి పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ని బీజేపీ వివాదాస్పద అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 3.6 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో చిత్తు చేశారు.

అశోక్ చవాన్
మహారాష్ట్రలోని నాందేడ్ లో కాంగ్రెస్ కి అతిపెద్ద ఓటమి ఎదురైంది. బీజేపీ అభ్యర్థి ప్రతాప్ రావ్ చిఖాలికర్ మాజీ సీఎం అశోక్ చవాన్ ను ఆయన కంచుకోటలోనే 40,010 ఓట్ల తేడాతో ఓడించారు.

సుశీల్ కుమార్ షిండే
కీలక సోలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండేను బీజేపీ తరఫున బరిలోకి దిగిన సిద్దేశ్వర్ శివాచార్య 1, 58,608 ఓట్లతో ఓడించారు.

హరీష్ రావత్
నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీష్ రావత్ ను 3,39,096 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.

ముకుల్ సంగ్మా
మేఘాలయ మాజీ సీఎం, తురా నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ముకుల్ సంగ్మాను నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పిపి) అభ్యర్థి అగథా సంగ్మా 3 లక్షలకు పైగా తేడాతో చిత్తు చేశారు.

భూపిందర్ సింగ్ హుడా
సోనిపట్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాను బీజేపీకి చెందిన రమేష్ చందర్ కౌశిక్ 1,64,864 ఓట్ల తేడాతో ఓడించారు.

వీరప్ప మొయిలీ
చిక్ బళ్లాపూర్ లోక్ సభ సీటులో కాంగ్రెస్ సీనియర్ నేత, 1992-94లో కర్ణాటక సీఎం వీరప్ప మొయిలీ, బీజేపీ అభ్యర్థి బీఎన్ బచే గౌడ చేతిలో 5,63,802 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

జమ్ముకశ్మీర్ లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన బాబూలాల్ మరాండీ, శిబూ సోరెన్, కూడా ఓడిపోయిన వారిలో ఉన్నారు.