‘రెండో గేటు’ నుంచే హరీశ్ ఎంట్రీ!!

har2gate

by zakeer.sk, editor.

ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హరీశ్ రావు ‘రెండో గేటు’ నుంచే శాసనసభ ప్రాంగణంలోకి వెళ్ళనున్నారు. ‘మొదటి గేటు’ నుంచి అసెంబ్లీ స్పీకర్,డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే ప్రవేశించడానికి నిబంధనలు ఉన్నవి. ఎమ్మెల్యేలంతా ‘రెండో గేటు’ గుండానే అసెంబ్లీలోకి ప్రవేశించాలి. క్యాబినెట్ లో చోటు దక్కని మాజీమంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్న ‘నెంబర్ 1 ‘ గేటు నుంచి ప్రవేశించే వీలు లేదు.కేటీఆర్ అధికారపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్లో ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఆయనకున్న ప్రాధాన్యం వేరు. గుర్తింపు,గౌరవం వేరు. ప్రత్యేకంగా హరీశ్ రావు ప్రస్తావన ఎందుకంటే 2004 లో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఆ గేటు గుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కారణం… వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హరీశ్ రావు ఆనాడు సభ్యుడు. కనుక నెంబర్ 1 గేటు నుంచి మంత్రిగా ఆయన రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు హరీష్ రావు శాసనసభ్యుడు, మాజీ మంత్రి మాత్రమే. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కనున్నది?ఎవరెవరు అదృష్ట జాతకులు?ఎవరికి ఏ పోర్టుఫోలియో రావచ్చు ?వంటి అనేక అంశాలపై రెండు నెలలుగా తర్జనభర్జన సాగుతున్నది. తాడూ బొంగరం లేకుండా ఊహాగానాలు, కథనాలు సాగుతున్నవి. తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ‘హరీశ్ రాజకీయ భవితవ్యం’పై ప్రధాన స్రవంతి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉన్నది. ‘క్యాబినెట్ లో ఈ సారి హరీష్ రావు ఉండరు’ అని ఏ కారణంగానో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు హరీశ్ రావుకు మధ్య ‘గ్యాప్’ వచ్చిందని దాన్ని ఇప్పట్లో పూడ్చటం కష్టమని కూడా వార్తలు వెలువడుతూనే ఉన్నవి. ఆ ‘గ్యాప్’ కు కారణాలు కేసీఆర్ ఎవరికీ చెప్పరు. ఆయనను ఎవరూ అడగరు. కేసీఆర్ కు హరీశ్ రావుకు మధ్య ‘పొసగడం’లేదన్న సమాచారం సెప్టెంబర్ 2 న ‘కొంగర కలాన్’ బహిరంగసభ నాటికే బయటకు పొక్కింది. సెప్టెంబర్ 6 న అసెంబ్లీ రద్దు, 105 మంది అభ్యర్థుల ప్రకటన తర్వాత విబేధాలు పుంజుకున్నట్టు టిఆర్ఎస్ శ్రేణులు అంటున్నవి. టిఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక, టివి న్యూస్ చానళ్లలో కొద్ది రోజుల పాటు హరీశ్ రావు వార్తలు ‘నిషేధానికి’ గురైనవి. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో హరీశ్ ఎన్నికల ప్రచారం వార్తలను సైతం ‘కవర్’ చేయలేదు.తర్వాత ఆ ‘అప్రకటిత నిషేధాన్ని’ ఒక శుభోదయాన ఎత్తివేసినట్టు ప్రజలకు అర్ధమైంది. అంతా సర్దుకున్నదనీ, పరిస్థితులు చక్కబడ్డాయనీ, పొరపొచ్చాలు దూరమయ్యాయనీ పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో… ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 11 లేదా, రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డిసెంబర్ 13 వ తేదీ నుంచో మేనమామతో సంబంధాలు ‘తెగిపోయినవి’. ఈ వార్తా కథనాలను ఒకటీ, రెండు ఆంగ్ల దినపత్రికలు కూడా ప్రచురించాయి. ”హరీశ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే” నని కేసీఆర్ చాలాసార్లు స్వయంగా ప్రకటించారు. ఈ సారి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన 88 స్థానాల్లో హరీశ్ కు లభించిన మెజారిటీ అత్యధికం. ఇరిగేషన్, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా హరీశ్ రావు తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకున్నారు. ఆయన సమర్ధతను ముఖ్యమంత్రి స్వయంగా పొగిడిన సందర్భాలూ ఎన్నో ఉన్నవి. ఉద్యమకాలం నుంచి కీలక బాధ్యతలను హరీశ్ రావుకు అప్పజెపుతూ వచ్చారు. హరీశ్ ప్రతి సందర్భంలో కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారని పార్టీ నాయకుల్లో అభిప్రాయం ఉన్నది. సిద్దిపేట నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో హరీశ్ ఇమేజ్ బాగా పెరిగిన మాట నిజం. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులను హరీష్ రావు స్వయంగా పర్యవేక్షించారు.కాగా ప్రజాకూటమి రూపంలో నాలుగు పార్టీలు, బీజేపీ ముప్పేట దాడి చేస్తుండటంతో ఆ దాడిని తిప్పికొట్టేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులు పెరిగే కొద్దీ విభేదాలు ముదురుతాయి. చివరికి పార్టీ గెలుపు ఓటములను కూడా ఆవే శాసిస్తాయి. అందుకు తమిళనాడులో డీఎంకే, ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీల విచ్ఛిన్నమే నిదర్శనం. అలాంటి విబేధాలు తన కుటుంబంలో రాకుండా కేసీఆర్ జాగ్రత్తపడ్డారు. కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావు,కూతురు ఎంపీ కవితలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించారు. కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తే, కేటీఆర్ 70 స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తించారు. నగరంలో, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెబల్స్, అసమ్మతులను బుజ్జగించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. కేటీఆర్ టీఆర్ఎస్ కు అదనపు బలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధారించుకున్నందునే ఎన్నికలు ఫలితాల వెంటనే ఆయనను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి సంచలనం సృష్టించారు.ఇదిలా ఉండగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం హరీశ్ పై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మండలి విస్తరణకు కొన్ని గంటల ముందు ఆయన ప్రకంపనలు పుట్టించారు. ” కేసీఆర్ కు తెలియకుండా హరీష్ రావు 26 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారు.హరీష్ రావు,అమిత్ షా తో ఫోన్లో మాట్లాడిన ‘ఆడియో రికార్డు’ కేసీఆర్ దగ్గరకు చేరింది.అమిత్ షా తొ మాట్లాడిన ఆడియోను హరీష్ రావు పీ.ఏ రికార్డు చేశాడు.అందుకే హరీష్ రావు కు మంత్రిపదవి ఇవ్వలేదు.హరీష్ రావు కోటరీకి టీఆరెస్ లో మనుగడ కష్టం” అని రేవంత్ అన్నారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటో ఎవరికీ తెలియదు.అసలు నిజనిర్ధారణ చేసేదెవరు? ఎవరికి అవసరం? ఏదో బలమైన కారణమున్నందుకే హరీశ్ కు మంత్రిపదవినివ్వడంలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులూ అనుకుంటున్నారు. ఆ బలమైన కారణం ఎప్పటికి వెలుగు చూస్తుందో తెలియదు. అసలు వెలుగులోకి రాకుండా కూడా ఉండవచ్చు. ”నా చావూ – పుట్టుక టిఆర్ఎస్ లోనే” అని హరీశ్ పలుమార్లు మీడియా సమావేశాల్లో, టివి న్యూస్ చానళ్లలో చెప్పుకున్నారు. కేసీఆర్ పట్ల, పార్టీ పట్ల తన విధేయతను చాటుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయినా ‘ఎక్కడో ఏదో జరిగింద’న్న ప్రచారం జరుగుతున్నది. అందువల్లనే కేసీఆర్ ఆయనను పక్కనబెట్టారన్న వాదన ఉన్నది. హరీష్ రావును పార్లమెంటుకు పోటీ చేయించవచ్చునంటూ కొంతకాలం ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ ఉండకపోవచ్చునని, ‘గ్యాప్’ తొలగిపోయే పక్షంలో పార్లమెంటు ఎన్నికల అనంతరం జరిగే విస్తరణలో హరీశ్ ను క్యాబినెట్ లోకి తీసుకోవచ్చునని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నవి.