నీరవ్ మోడీకి నాలుగోసారీ చుక్కెదురు


నీరవ్ మోడీకి నాలుగోసారీ చుక్కెదురు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. నీరవ్ కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతే కాకుండా జడ్జి నీరవ్ మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ లభిస్తే నీరవ్ మోడీ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా జడ్జి నీరవ్ మోడీ తరఫు న్యాయవాదికి గట్టిగా చురకలేశారు. బెయిల్ లభిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా ఉంటారనే నమ్మకం తనకు కలగడం లేదని జడ్జి అన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని జడ్జి వ్యాఖ్యానించారు.


పిటిషనర్ పై ఎన్నో దేశాల్లో మోసం, కుట్ర కేసులు నమోదై ఉన్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వడం సరికాదని జడ్జి అన్నారు. నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ తిరస్కరించడం ఇది నాలుగోసారి.

ఇంతకు ముందు లండన్ లోని ఒక కోర్టు నీరవ్ మోడీకి జూన్ 26 వరకు జైలు (జుడీషియల్ కస్టడీ)లో ఉంచాలని తీర్పునిచ్చింది. 48 ఏళ్ల వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, భారత్ లో రూ.13,000 కోట్ల మేర పీఎన్బీ మోసం కేసులో మోస్ట్ వాంటెడ్.