లగడపాటి ఎఫెక్ట్! బెట్టింగ్ వీర్రాజు ఆత్మహత్య!!

eluru:

తన అభిమాన పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టిన ఓ వ్యక్తి ఓడిపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. తాను బెట్టింగ్ కట్టిన పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగిన సదరు వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ 110-130 సీట్లతో అధికారంలోకి వస్తుందని లగడపాటి సహా పలు సర్వేలు తేల్చాయి. దీంతో వీర్రాజు టీడీపీ గెలుస్తుందని రూ.12 లక్షల పందెం కాశాడు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఓవైపు పార్టీ ఓటమిపాలు కావడం, మరోవైపు రూ.12 లక్షలు ఆవిరైపోవడంతో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగాడు. ఆయన్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.