బీజేపీ వైపు టి.కాంగ్రెస్ నేతల పయనం!! చక్రం తిప్పుతున్న డీ.ఎస్?

By zakeer.sk:

పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మరికొందరు ప్రముఖులూ అదే బాట పట్టవచ్చు. టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు,కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు డి.శ్రీనివాస్ ఢిల్లీలో ఈ మేరకు చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. డి.ఎస్. కుమారుడు అరవింద్ మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి కవితను ఓడించిన సంగతి తెలిసిందే.డి.ఎస్.టిఆర్ఎస్ లో సాంకేతికంగా మాత్రమే ఉన్నట్టు లెఖ్ఖ.టిఆర్ఎస్ పార్టీతో, ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన సంబంధాలు పూర్తిగా దెబ్బతిని చాలా కాలమైంది. ఆ పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా,పలుమార్లు అవమానాలకు గురైనట్టు డి.ఎస్.తీవ్రంగా మధనపడుతున్నారు. అందువల్ల ఆయన టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ పై పగతో రగిలిపోతున్నట్టు తెలియవచ్చింది. ప్రతీకారం తీర్చుకోవడానికి గాను తగిన సమయం కోసం డి.శ్రీనివాస్ కాచుకొని ఉన్నట్టు సమాచారం. తన కుమారుడు అరవింద్ బిజెపి ఎంపీగా గెలుపొందడంతో ఇక ‘సరైన సమయం’ వచ్చిందని డి.ఎస్. భావిస్తున్నట్టు తెలుస్తున్నది.తన పూర్వాశ్రమమైన కాంగ్రెస్ కు తెలంగాణలో మనుగడ లేదని సీనియర్ రాజకీయవేత్త అయిన డి.ఎస్. నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సమీప భవిష్యత్తులో తెలంగాణలో బలమైన రాజకీయశక్తిగా అవతరించడానికి బిజెపికి మాత్రమే ‘స్కోప్’ ఉందని డి.ఎస్.విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ‘పొలిటికల్ వాక్యూమ్’ ఉందని, ఆ స్థానాన్ని బిజెపి భర్తీ చేయనుందని నమ్ముతున్నవాళ్లలో డి.ఎస్. ఒకరు. 2024 ఎన్నికల నాటికి బిజెపి బలమైన శక్తిగా అవతరించి కేసీఆర్ ను గట్టిగా ఢీ కొనగలదని డి.ఎస్.సహా పలువురు కాంగ్రెస్ మాజీలు అభిప్రాయపడుతున్నారు. అధికారపార్టీలోనూ కొందరు నాయకులలో అలాంటి భావన బలంగా ఉన్నది.ఎన్నికలకు ముందు మాజీ మంత్రి డి.కె.అరుణ సహా కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరిపోయారు. చాలామంది నాయకులపై అమిత్ షా వాలా విసిరినట్టు బిజెపి,కాంగ్రెస్ శ్రేణులలో ఊహాగానాలు గడచిన అక్టోబర్ నుంచే ఉన్నవి. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ‘పొటెన్షియల్’ నాయకులను గుర్తించి వారిని చేర్చుకోవాలని అమిత్ షా నిర్ణయించారు. ఆయన ‘మిషన్ తెలంగాణ’ ను ప్రారంభించారు. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే తమ నిర్ణయం చెబుతామని అప్పట్లో అమిత్ షా కు కొందరు చెప్పారని అంటున్నారు.వారి పూర్తి వివరాలు వెల్లడి కావడం లేదు.దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించాలనే తమ టార్గెట్‌ను పూర్తి చేసుకునే క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తెలంగాణ, ఏపీ, బెంగాల్‌, ఒడిశా,కర్ణాటకలపై కేంద్ర హొమ్ మంత్రి అమిత్ షా ఫోకస్ పెట్టినట్టు బిజెపి అగ్రనాయకులు చెబుతున్నారు. తెలంగాణాలో 4 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడం బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ కంచుకోట ఉత్తర తెలంగాణలో ఏకంగా మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం బీజేపీ కూడా ఊహించనిదే.కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ సీట్లలో అధికారపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సామాజికవర్గం ‘వెలమ’ కు చెందిన వినోద్, కేసీఆర్ కన్నకూతురు కవితను ఓడించడం గొప్ప విజయంగా బిజెపి భావిస్తున్నది. రాష్ట్రంపై ఫోకస్ పెడితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే భావనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను బీజేపీ ముఖ్యనేత రామ్‌మాధవ్‌కు ఆ పార్టీ నాయకత్వం అప్పగించినది. రాష్ట్రంలోని అనేకమంది నాయకులను బీజేపీలో చేర్పించుకునే దిశగా ఆయన పథకాలు రచించి అమలు చేస్తున్నారు. తెలంగాణలో టిడిపికి మనుగడ లేనందున పలువురు టీ టీడీపీ నాయకులు సహజంగానే బిజెపి వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.టిడిపికి చెందిన మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి ఆ దిశగా ముందడుగు వేశారు. టీఆర్ఎస్‌లోకి వెళ్లలేక, కాంగ్రెస్‌లో చేరలేకపోతున్న టీ టీడీపీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తున్నది. వారితో పాటు వారి క్యాడర్ కూడా బీజేపీకి కలిసొస్తుంది. ”కేసీఆర్ కుటుంబ పాలన నచ్చక టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు. ఇక మా టార్గెట్ తెలంగాణ. మా యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్రంలో కమల వికాసం తథ్యం” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అమిత్ షా త్వరలో తెలంగాణకు రానున్నారు. ఇక్కడి రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తారు. 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని 2019 లోనే రూపొందించాలని అమిత్ షా నిర్ణయమని బిజెపి నాయకులంటున్నారు.