ప్రగతి భవన్ ముట్టడించిన టీఆర్టీ అభ్యర్థులు

ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ టీఆర్టీ అభ్యర్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. ఫలితాలు వచ్చి 7 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని ఆరోపించారు. సెలక్టైన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి ప్రమాణస్వీకారం చేసినప్పుడే తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. విద్యావాలంటీర్లను ఈ ఏడాది కూడా కొనసాగిస్తూ నిన్న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం, శాశ్వత ఉద్యోగాల నియామకం చేపట్టకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్టీ ప్రక్రియను పూర్తి చేసి త్వరగా పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చుంటామని హెచ్చరించారు. ముట్టడికి యత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.