వైరల్ వీడియో: విలేకరిని చావబాదిన రైల్వే పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని షామ్లీలో ఒక విలేకరిని దారుణంగా చితకబాదిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ న్యూస్24కి చెందిన స్ట్రింగర్ అమిత్ శర్మ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గురించి వార్త సేకరించేందుకు చేరుకున్నారు. అక్కడ ఉన్న జీఆర్పీ పోలీస్ సిబ్బంది అతనిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. అమిత్ తన మొబైల్ తో దృశ్యాలు చిత్రీకరిస్తుండగా జీఆర్పీ పోలీస్ ఇన్స్ పెక్టర్ అతని మొబైల్ లాక్కొని అతనిని కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత అమిత్ ను రాత్రంతా పోలీస్ స్టేషన్ లో బంధించారు. తోటి విలేకరులు ధర్నా చేయడంతో ఉదయం అతనిని విడుదల చేశారు. అమిత్ ను కొడుతున్న ఒక వీడియో బయటికి వచ్చింది. ఇందులో పోలీస్ సిబ్బంది అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నారు.

‘వాళ్లు సాధారణ దుస్తుల్లో ఉన్నారు. ఒకరు నన్ను కొట్టగానే కెమెరా పడిపోయింది. దానిని తీసుకొంటుండగా నన్ను కొట్టారు. బూతులు తిట్టారు. నన్ను లాకప్ లో బంధించారు. ఫోన్ లాక్కొన్నారు. వాళ్లు నా నోట్లో మూత్రం పోశారని’ విలేకరి అమిత్ శర్మ వాపోయారు.


విలేకరిని చితకబాదిన ఈ కేసులో షామ్లీ జీఆర్పీ ఎస్ హెచ్ఓ రాకేష్ కుమార్, కానిస్టేబుల్ సంజయ్ పవార్ లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు యుపి పోలీస్ డీజీపీ ఓపీ సింగ్ ప్రకటించారు.


షామ్లీ రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగా ధీమాన్ పురా రైల్వే గేటు దగ్గర మంగళవారం రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటలకు ట్రాక్ షంటింగ్ సమయంలో గూడ్స్ రైలు రెండు పెట్టెలు పట్టాలు తప్పాయి. దీంతో భారీ శబ్దం వెలువడటంతో చుట్టుపక్కల ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనలో ట్రాక్ కూడా బాగా దెబ్బ తింది. కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండో రైలు గేటు మూయడంతో రోడ్డు ప్రయాణికులు అవస్థలు పడ్డారు.