వీడియో: శిథిలాల కింద 70 గంటలు, ప్రాణాలతో బయటికొచ్చిన దంపతులు

వీడియో: శిథిలాల కింద 70 గంటలు, ప్రాణాలతో బయటికొచ్చిన దంపతులు

కర్ణాటకలోని ధార్వాడ్ లో మంగళవారం ఓ నిర్మాణంలోని భవనం కుప్పకూలిన ఘటనలో 15 మంది మరణించారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న సంగీత కోకరె, ఆమె భర్త దిలీప్ తిండి, నీళ్లు లేకుండా దాదాపు 72 గంటలపాటు గడిపి చివరికి ప్రాణాలతో బయటపడ్డారు.

సహాయ చర్యల్లో పాల్గొంటున్న దాదాపు 12 మంది అధికారుల సమక్షంలో సంగీతను స్ట్రెచర్ పై బయటికి తీసుకొచ్చారు. ఆ వీడియోని కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి ఎంఎన్ రెడ్డి సోషల్ మీడియా షేర్ చేశారు. పసుపు టోపీలు పెట్టుకొని అధికారులు స్ట్రెచర్ పై తనను బయటికి తీసుకొస్తుంటే సంగీత మొహంలో భయం, విస్మయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిథిలాల్లోకి ఒక సొరంగం తవ్వి దాని ద్వారా సిబ్బంది చిక్కుకున్న వారిని చేరుకున్నారు.
మొదట ఆమె భర్తని, తర్వాత ఆమెని అధికారులు అదే సొరంగ మార్గంలో రక్షించారు. ప్రస్తుతం వాళ్లిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

మంగళవారం నుంచి ఇప్పటి వరకు భవన శిథిలాల నుంచి 64 మందిని రక్షించారు. ఈ ఉదయం మరో వ్యక్తిని 62 గంటల తర్వాత రక్షించి బయటికి తీసుకు రాగలిగారు. ఇంకా నలుగురు శిథిలాల కింద ఉండి ఉండవచ్చని అధికారులు అంటున్నారు.

ధార్వాడ్ లోని కుమారేశ్వరి నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్థుల భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. నిర్మాణ కంపెనీ ఐదుగురు యజమానుల్లో నలుగురు మంగళవారం రాత్రి లొంగిపోయారు.