డిసెంబర్ 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!!

డిసెంబర్ 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!!

విండోస్ ఆధారిత ఫోన్ యూజర్లకు ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ సర్వీస్, వాట్సాప్ పెద్ద షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని విండోస్ ఆధారిత ఫోన్లకు సపోర్ట్ ఆపేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

విండోస్ ఓస్ ఆధారిత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి డిసెంబర్ నుంచి సపోర్ట్ ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించడంతో అన్ని విండోస్ ఫోన్లకు తాము కూడా సపోర్ట్ నిలిపేస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. దీంతో విండోస్ ఫోన్ల యూజర్లు ఇకపై వాట్సాప్ సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేరు. విండోస్ ఫోన్లకి చిట్టచివరి అప్ డేట్ జూన్ లో విడుదల చేయనున్నట్టు మెసేజింగ్ సర్వీస్ చెప్పింది. ఏడాది చివరి వరకు వాట్సాప్ విండోస్ ఫోన్లపై పనిచేస్తుందని హామీ ఇచ్చింది.

ఇంతకు ముందు విండోస్ ఫోన్ 8.0 లేదా అంతకు ముందున్న విండోస్ ఫోన్ డివైసెస్ తో పాటు ఆండ్రాయిడ్ 2.3.7, ఐఓఎస్ 7 అంతక‌న్నా త‌క్కువ వెర్షన్ ఓఎస్‌లు ఉన్న డివైస్‌ల‌లో ఫిబ్రవ‌రి 1, 2020 నుంచి వాట్సాప్ ప‌నిచేయ‌ద‌ని కంపెనీ పేర్కొంది. దీంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న విండోస్ మొబైల్ డివైసెస్ కి వాట్సాప్ తాజా ప్రకటనతో ది ఎండ్ కార్డ్ పడినట్టయింది.